'మీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా ఉన్నాయి' అంటూ సీఎల్పీ నేత జానారెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. సీఎల్పీ నేత జానారెడ్డి తీరుపై తెలంగాణ సీఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చజరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో మూడు గంటలుగా సమావేశం కొనసాగింది. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం మహా ఒప్పందం విషయంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంతపార్టీ ఎమ్మెల్యేలు తప్పుబట్టడం గమనార్హం.
దీంతో జానారెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆయన వాపోయారు. తనను విమర్శిస్తే పార్టీకే నష్టమని ఆక్రోశం వెళ్ళగక్కారు. ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం కేసులో సీబీఐ విచారణ అవసరం లేదన్న జానారెడ్డి వ్యాఖ్యలను సమావేశంలో పలువురు నేతలు తప్పుబట్టారు. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.