నాయిని జీవితం కార్మిక లోకానికి అంకితం : చంద్రబాబు - పవన్

గురువారం, 22 అక్టోబరు 2020 (13:03 IST)
తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి బుధవారం అర్థరాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. బుధవారం రాత్రి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే, నాయిని మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
'తెలంగాణ రాష్ట్ర తొలి హోం శాఖామంత్రి, జీవితాంతం కార్మిక లోకానికి అండగా నిలిచి సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి మరణం విచారకరం. కార్మిక లోకానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, నాయిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 
 
కాగా, అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, కార్మిక నాయకుడు, తెలంగాణవాది నాయిని నర్సింహారెడ్డి మరణం కార్మిక వర్గానికి, తెలంగాణవాసులకు తీరని లోటన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన నిబద్ధత కలిగిన ఉద్యమకారుడు నాయిని అని కొనియాడారు. 
 
తొలి, మలి దశ ఉద్యమాలలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు. కార్మిక నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎమ్మెల్సీగా ప్రజలకు అమూల్యమైన సేవలను అందించారని చెప్పారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంత్రిగా ఆయన ప్రజలకు సేవలందించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు