వణికిపోతున్న తెలంగాణ... వలస కూలీలను తరలిస్తున్న సర్కారు

గురువారం, 11 జూన్ 2020 (08:20 IST)
తెలంగాణ రాష్ట్రం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. నిజానికి ఆరంభంలో కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉన్నది. కానీ, ఆ తర్వాత ఈ కేసులు క్రమంగా పెరగసాగాయి. ఇపుడు ప్రతి రోజూ వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య అటు ప్రభుత్వ అధికారులతో పాటు.. ఇటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 
 
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 191 కేసులు నమోదయ్యాయి. అలాగే, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,111కి చేరుకోగా, 156 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూసిన వాటిలో 143 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఇందులో మేడ్చల్‌, సంగారెడ్డిలో 11 చొప్పున, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, మెదక్‌లో మూడు చొప్పున కేసులు నమోదు కాగా, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌లో రెండేసి, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్ధిపేటలో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,817 మంది డిశ్చార్జ్ కాగా, 2,138 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలస కూలీలను వారివారి సొంత రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోంది. ఇందులోభాగంగా, వలస కార్మికుల కోసం గురువారం తెలంగాణ నుంచి ఐదు శ్రామిక్ రైళ్లు ఒడిశాకు బయలుదేరనున్నాయి. వీటి ద్వారా 9,200 మంది వలస కార్మికులు సొంత రాష్ట్రానికి చేరుకోనున్నారు. వీరంతా ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు. 
 
రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్న 15,800 మందిని తరలించేందుకు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వలస కార్మికులను తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన కార్మికుల కోసం రెగ్యులర్ రైళ్లకు అదనంగా నాలుగు బోగీలు నడపాలని సూచించింది.
 
అలాగే, కార్మికులను పూర్తిగా తరలించే వరకు వారికి ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, వారి రవాణా చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించాలని కోరుతూ ప్రొఫెసర్‌ రామ శంకర్‌ నారాయణ్‌ మేల్కొటి, న్యాయవాది పీవీ కృష్ణయ్య, జీవన్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను బుధవారం విచారించిన కోర్టు ఈ మేరకు సూచనలు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు