కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించుటకు కమ్యునిటి సహకారం చాలా కీలకమని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు.
బుధవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు వికాస్ గాడే, డా. రవీందర్‌లతో కలిసి జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ బి.సంతోష్, సిసిపి దేవేందర్‌రెడ్డి, కోవిడ్-19 కంట్రోల్ రూం ఓ.ఎస్.డి అనురాధలతో నిర్వహించిన సమావేశంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు.
జిహెచ్‌ఎంసి పరిధిలో జోన్లు, సర్కిళ్లు, వార్డులవారిగా నెలకొన్న పరిస్థితి గురించి వాకబ్ చేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులు ఇచ్చారని, ఇదే విధంగా కేసుల సంఖ్య నమోదైతే జూలై 31 వరకు పరిస్థితి తీవ్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ, ముంబాయి, చెన్నైలలో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కూడా కోవిడ్-19 పరిక్షలు నిర్వహిస్తున్నందున, ప్రైవేట్‌గా నిర్వహించిన పరిక్షలలోనే 70శాతం పైబడి పాజిటీవ్ కేసులు వస్తున్నట్లు తెలిపారు.
జిహెచ్‌ఎంసి పరిధిలో గుర్తించిన పాజిటీవ్ కేసుల సంఖ్య, సంబంధిత కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు అనుసరిస్తున్న పద్దతి, కోవిడ్-19 లక్షణాలు కనిపించిన వ్యక్తులకు కోవిడ్-19 నిర్థారణ పరిక్షలు నిర్వహించుటకు ఉన్న సదుపాయాలు, ఆసుపత్రులు, హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్, కంటైన్‌మెంట్ అంశాల గురించి వివరంగా చర్చించారు.
ప్రస్తుత పరిస్థితులలో కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించుటకు హోం కంటైన్‌మెంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమని సంజయ్ జాజు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 100 కేసులకంటే ఎక్కువగా నిర్థారణ అవుతున్నందున జిహెచ్‌ఎంసి పరిధిలోనే నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డిప్యూటి కమిషనర్లతో వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమాచారాన్నితీసుకుంటూ, సమన్వయాన్ని పెంచాలని సూచించారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సూచనలు, సహకారాన్ని పొందుటకు సంబంధిత వాట్సప్ గ్రూప్‌లో ప్రజారోగ్య సంచాలకులతో పాటు తనను కూడా చేర్చాలని తెలిపారు. కోవిడ్-19 కంట్రోల్ రూం చేస్తున్న విధుల గురించి కూడా సంజయ్ జాజు వాకబ్ చేశారు.