తెలంగాణ క్యాబినెట్ మీటింగ్.. ఉద్యోగుల వేతన సవరణపై చర్చ

మంగళవారం, 8 జూన్ 2021 (13:03 IST)
ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం భేటీ కానుంది. ప్ర‌గతి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌రుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఫైల్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 
 
ఉద్యోగుల వేతన సవరణపై చర్చించనున్నట్టు సమాచారం. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పూర్తి వివరాలతో నోట్‌ను ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించినట్టు తెలిసింది. ఈ నోట్‌ను మంత్రివర్గం ముందుంచనున్నారు.
 
దీనిపై చర్చించి నిర్ణయం తీసుకొన్నాక ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన జీవోలను సర్కారు విడుదల చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే వేతన సవరణను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 
 
ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ మార్చి 23న అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు వెంటనే విడుదలైనా, ఉద్యోగుల ఫిట్‌మెంట్‌కు సంబంధించిన ఉత్తర్వులు వివిధ కారణాల వల్ల వెలువడలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు