దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు గడుస్తున్నా దళితులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని, ఆ దళితుల కోసమే రాజ్యాంగాన్ని మార్చాలని తాను కోరుతున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసమే కొత్త రాజ్యాంగం రాయాలని కోరుతున్నానని చెప్పారు.
దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కోసం కొత్త రాజ్యాంగం రావాలని కోరుతున్నానని తెలిపారు. భారతదేశం అమెరికా కన్నా గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలని సీఎం కేసీఆర్ అభిలషించారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తుంటారని, ఈ తరహా రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అసోం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలోనే తాను రాహుల్ గాంధీ విషయం మాట్లాడానని, తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని నిలదీశారు. శాంతిభద్రతలు కోరుకుందామా? ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అనేది యువత ఆలోచించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.