హైదరాబాద్ : తెలంగాణా సీఎం కేసీఆర్ ఏది చేసినా, డేరింగ్‌గా, మనస్ఫూర్తిగా చేసేస్తారు. దానికి ఎవరు ఏమనుకుంటారనే జంకు ఆయనకు ఉండదు. ఎవరినైనా తిట్టినా అలాగే తిడతారు... ఎవరినైనా అభిమానించి, గౌరవించినా...అదే స్థాయిలో చేస్తారు. ముఖ్యంగా ఆయన ఇటీవల శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని ప్రత్యేకంగా గౌరవించి అధికారిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. గోదావరి పుష్కరాలకైనా, కృష్ణా పుష్కరాలకైనా... తెలంగాణాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకైనా జీయర్ స్వామిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.
ఇపుడు తాజాగా తెలంగాణా సీఎం తన అధికారిక నివాసంలో గృహ ప్రవేశ శుభకార్యాన్ని కూడా చిన జీయర్ స్వామి చేతుల మీదుగానే జరిపించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో జీయర్‌కు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఎంతో భక్తి ప్రపత్తులతో జీయర్‌ను సీఎం తన కుర్చీలో కూర్చోబెట్టి... ముఖ్యమంత్రి దంపతులు నిలబడి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో కూర్చోవడం మరెవరికీ సాధ్యం కాదనే విషయం తెలిసిందే. కానీ, కేసీఆర్‌లో ఉన్న ఆధ్యాత్మిక చింతన, పండితులకు ఆయన ఇచ్చే గౌరవం ఎలాంటిదో దీన్నిబట్టి అర్థం అవుతుంది.