సీఎం రాక నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కేవలం వాసాలమర్రి గ్రామస్తులే సీఎం సభలో పాల్గొనేలా ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.
గతేడాది కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెల్సిందే. అప్పట్లో జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభోత్సవాన్ని ముగించుకుని ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా వాసాలమర్రిలో ఆగారు. ఆ సమయంలో గ్రామస్తులతో మాట్లాడి అక్కడి సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఆ మేరకు అక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. సీఎం తాజా పర్యటనలో వాటిని పరిశీలించనున్నారు. వాసాలమర్రిని ఎర్రవెల్లి,అంకాపూర్ తరహాలో తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... చెప్పినట్లుగానే గ్రామాన్ని అభివృద్ది చేయడంతో గ్రామస్తులు సంతోషిస్తున్నారు. కేసీఆర్ పర్యటనలో గ్రామానికి మరిన్ని వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నారు.