హైదరాబాద్: తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ఇతర వ్యవహారాలపై సీఎం కేసీఆర్ రహస్య సర్వే చేయించారా..? రహస్య సర్వేలో సీఎం దగ్గర మార్కులు కొట్టేసిందెవరు..? సీఎం గుర్రుగా ఉన్నది ఎవరి మీద..? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తోంది.
ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నేరవేర్చిన సీఎం కేసీఆర్... రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు అహార్నిశలు కృషి చేస్తున్నారు. ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతూ, అవాంతరాలను అధిగమిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో సమస్యలను సున్నితంగా పరిష్కరించటం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు.
ఫలితంగా స్వల్ప కాలంలోనే తెలంగాణ కరెంట్ కష్టాలను అధిగమించి దేశంలోనే అగ్రగామిగా నిలబడింది. సీఎం కేసీఆర్ చేపడతున్న సంక్షేప పథకాలు, రాజకీయ ఏకీకరణ జరగాలన్న సీఎం పిలుపుతో ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్ఎస్ బలం 81కి చేరింది. పాలేరులో టీఆర్ఎస్ గెలిస్తే ఆసంఖ్య 82కు చేరనుంది.
బంగారు తెలంగాణ సాధనలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో అవసరమని గుర్తించిన సీఎం కేసీఆర్... వారి పనితీరుపై ప్రొగ్రెస్ రిపోర్టు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత సర్వే నిర్వహించారట. ఇందులో కొంతమంది సీఎం అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నా... మరికొంతమంది పనితీరు చాలా వరెస్ట్‌గా ఉందని తేలిందట.
ముఖ్యంగా 25 మంది పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కాలేకపోవటంతో పాటు అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తుండటంతో సీఎం వీరి నాయకత్వంపై పునరాలోచనలో పడ్డారట. పనితీరు మార్చుకోకపోతే 2019లో సీట్లు ఇచ్చేది లేదని కేసీఆర్ అంతరంగికులతో చెప్పారట. సీఎం రహస్య సర్వేతో అవినీతి ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పుడు ఈ రహస్య సర్వే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.