చనిపోయిన వృద్ధుడికి కరోనా ... ఆయన కలిసిన 200 మందికి రక్త పరీక్షలు

సోమవారం, 30 మార్చి 2020 (10:53 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వృద్ధుడు చనిపోయాడు. ఈయనకు కరోనా వైరస్ సోకినట్టు చనిపోయిన తర్వాత తెలిసింది. దీంతో ఆయన జీవించివుండగా, సుమారుగా 200 మందిని కలిశారు. దీంతో వీరందరికీ కరోనా వైరస్ సోకిందా లేదా అని నిర్ధారించేందుకు రక్త పరీక్షలు నిర్వహించాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఖైరతాబాద్ ప్రాంతంలో జల్లెడపడుతున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ కారణంగా తెలంగాణాలో నమోదైన తొలి మరణం ఇదే. ఖైరతాబాద్ ప్రాంతంలో నమోదుకాగా, ఈ ప్రాంతాన్నంతా అధికారులు జల్లెడ పతుతున్నారు. ఓ వృద్ధుడు మరణించిన తర్వాత అతని రక్త నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు నిర్దారణ అయింది. దీంతో వైద్యాధికారులు, శానిటేషన్‌ సిబ్బంది, ఇతర అధికారులతో అతను నివాసం ఉంటున్న ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌, ఇందిరానగర్‌‌లో పర్యటించి, మృతుడి కుటుంబీకులు, వారు కలిసిన వారందరిలో సుమారు 200 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. 
 
అదేసమయంలో ప్రజల్లో ఆందోళన పెరగకుండా చూసేందుకే ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఎవరైనా ఇటీవలికాలంలో విదేశాలకు వెళ్లి వచ్చినా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లినా, వారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 10 జెట్‌ మిషన్లు, 18 ఏయిర్‌ టెక్‌ మిషన్ల సాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నామని తెలిపారు. 
 
ప్రస్తుతం సిటీలో దాదాపు 18 వేల మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, ఖైరతాబాద్‌ పరిధిలో 2500 మంది ఉన్నారని వెల్లడించారు. వీరందరినీ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌‌లో ఉంచామని, దుకాణాదారులు తగు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు