రూ.2.50 కోట్ల భూమి రూ.25 లక్షలకే ఎలా ఇచ్చారు? తెలంగాణ హైకోర్టు

సోమవారం, 10 ఆగస్టు 2020 (15:35 IST)
తెలంగాణ ప్రభుత్వ తీరును ఆ రాష్ట్ర హైకోర్టు మరోమారు తప్పుబట్టింది. రూ.2.50 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 25 లక్షలకే కేటాయించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒక ఎకరం భూమి రూ.5 లక్షలు చొప్పున రూ.25 లక్షలకు ఎలా కేటాయించారని నిలదీసింది. దీంతో ప్రభుత్వ అడ్వకేట్ నీళ్లునమిలారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు ఎన్.శంకర్ హైదరాబాదులో సినీ స్టూడియో నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వానికి ఓ విన్నపం చేసుకున్నారు. దాంతో తెలంగాణ సర్కారు ఆయనకు రంగారెడ్డి జిల్లా మోకిల్లలో 5 ఎకరాల భూమి కేటాయించింది. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించింది. 
 
అయితే, ఈ భూమి కోట్ల విలువ చేస్తుందని, అలాంటప్పుడు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున దర్శకుడికి ఏ విధంగా కేటాయిస్తారంటూ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది.
 
రూ.2.50 కోట్ల విలువైన భూమిని ఎంతో తక్కువ ధరకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడానికి తగిన ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని అడిగింది. భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని సుప్రీం పేర్కొన్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని గుర్తుచేసింది. 
 
ఈ కేసు విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ, అడ్వకేట్ జనరల్ క్వారంటైన్‌లో ఉన్నారని, తమకు కొంత గడువు కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు