#BioAsiaSummit : వ్యాక్సిన్ హబ్‌గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

శనివారం, 24 ఫిబ్రవరి 2018 (15:29 IST)
హైదరాబాద్ మహానగరానికి భారతదేశానికి వ్యాక్సిన్ రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో మూడో రోజు జరుగుతున్న బయో ఏషియా సదస్సు‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి సురేష్ ప్రభు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఫార్మా ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. హైదరాబాద్ బల్క్ డ్రగ్ హబ్‌గా ప్రసిద్ధికెక్కింది. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
 
ఈసదస్సు సందర్భంగా, థాయ్‌లాండ్ వాణిజ్యశాఖ ఉపమంత్రి చుటిమా బున్యాప్రఫసార తనవెంట వచ్చిన 20 కంపెనీల ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలోని వ్యాపారావకాశాలపై చర్చించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ, జీనోమ్‌వ్యాలీ, హైదరాబాద్ నగరంలోని ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగంలో ఉన్న అవకాశాలపైన థాయ్‌లాండ్ బృందం అసక్తి వ్యక్తం చేసింది. థాయ్‌లాండ్ దేశానికి భారతదేశంతో కీలక వాణిజ్య సంబంధాలున్నాయని చుటిమా అన్నారు. హైదరాబాద్ తొలిపర్యటనలోనే ఇక్కడి విధానాలు, పెట్టుబడి అవకాశాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభు త్వ టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రశంసించారు.
 
అలాగే, ఈ సందస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ, ఫార్మా రంగం అభివృద్ధికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చొరవ ప్రశంసనీయమన్నారు. చాలా దేశాలు ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. ఫార్మా పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వ బాధ్యతన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, గత ఇరవై ఏళ్లలో భారత్‌లో పరిశ్రమలు ఎంతో అభివృద్ధి సాధించాయని సురేష్ ప్రభు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు