'కోడి కాళ్ళ'పై లడాయి... మద్యం మత్తులో వ్యక్తిని చంపేసి దహనం.. ఎక్కడ?

మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి పట్టణంలో ఓ దారుణం జరిగింది. కోడి కాళ్లు ఎవరు తినాలన్న దానిపై చెలరేగిన వివాదం చివరకు ఓ వ్యక్తి హత్యకు దారితీసి, దహన సంస్కారాలు కూడా నిర్వహించేశారు. ఈ కేసులో మృతుడుతో పాటు నిందితులు కూడా ఒరిస్సా వాసులు కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒరిస్సా రాష్ట్రంలోని సందరంఘడ్‌ జిల్లా సునాపర్వత్‌ గ్రామానికి చెందిన బసు జోర, పూజ లుంగీయార్‌, బీమ్సన్‌ జోరా, బయా లుంగీయార్‌ అనే నలుగురు వ్యక్తులు ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. అక్కడ నుంచి పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఓ ఇటుక బట్టీలో కూలీలుగా చేరి, జీవనోపాధి పొందుతున్నారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన మార్కెట్‌కు వెళ్లి కోడి కాళ్లు, పేగులు తెచ్చుకుని వంట చేసుకున్నారు. ఆ తర్వాత మద్యం సేవిస్తూ, కోడి కాళ్లు ఎవరు తినాలన్నదానిపై బీమ్సన్‌ జోరా మిగిలిన వారిలో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బసు జోర, పూజ లుంగీయార్‌, బయా లుంగీయార్‌ ఓ చెక్క దుంగతో బీమ్సన్‌ తలపై బలంగా బాదారు. 
 
ఒక్క దెబ్బకు తీవ్రగాయాలపాలైన బీమ్సన్‌ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో కార్మికులు ఇటుక బట్టీ యజమానులు ఈసారపు శ్రావణ్‌, మేకల మహేష్‌లకు సమాచారం ఇచ్చి, గాయపడిన బీమ్సన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
 
ఇక ఏం చేయాలో తోచక... ఇటుక పెళ్లలు పడిపోవడంతో బీమ్సన్‌ చనిపోయాడన్నట్టుగా ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొచ్చారు. అనంతరం.. కరీంనగర్‌ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. 
 
ఇందుకు మరో ఇటుక బట్టీ ఓనర్‌ అంబటి సతీష్‌ సహకరించాడు. విషయం బయటికి పొక్కడంతో గీతం శ్రీనివాస్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు