సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఆ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీసీఐను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వారంతా మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ పునఃప్రారంభంకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరపున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యంగా, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన తెలిపారు.
సీసీఐ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సీసీఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు.