హైదరాబాద్ దిగ్బంధం - అటు వెరవరూ ఇటు.. ఇటు వారెవరూ అటు పోకూడదు...

గురువారం, 7 మే 2020 (09:55 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా మేరకు కట్టడి అయింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో మాత్రం ఈ వైరస్ అదుపులోకి రావడం లేదు. ఈ రాష్ట్రంలో నమోదవుతున్న కొత్త కేసులన్నీ ఈ ప్రాంతం పరిధిలోనే నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ నగరాన్ని అష్టదిగ్బంధనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అంతేకాకుండా, అటు వారెవరూ ఇటు.. ఇటు వారెవరూ అటు వెళ్లకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలుజారీచేశారు. 
 
రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, సహాయక చర్యలపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. 'హైదరాబాద్‌ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉన్నది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టి అధికారులు హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని కోరారు.
 
ముఖ్యంగా, ఎవరికైనా పాజిటివ్‌ అని తేలినా.. ఆ వ్యక్తిని కలిసిన వారందరినీ క్వారంటైన్‌ చేయాలి. హైదరాబాద్‌లోని వారు బయటకు పోకుండా, బయటి వారు హైదరాబాద్‌లోకి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి. చురుకైన  ఐఏఎస్‌, పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలి. మొత్తం హైదరాబాద్‌ను చుట్టుముట్టాలి. వైరస్‌ను తుదముట్టించాలి అని ఆదేశించారు. 
 
ముఖ్యంగా, పక్క రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నది. వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ గ్రామాలున్నాయి. ఈ రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటు వారెవరూ ఇటు రాకుండా, ఇటు వారెవరూ అటు పోకుండా ఆపాలి. వైరస్‌ మన దగ్గర పుట్టింది కాదు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందేదే, కాబట్టి ప్రజల రాకపోకలను ఎంత కట్టడి చేయగలిగితే వైరస్‌ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు అవి సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు