రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాను నియంత్రించామని.. ప్రజలంతా లాక్ డౌన్‌కు మంచిగా సహకరిస్తున్నారని.. మరికొన్నాళ్లు ఓపిక పడితే కరోనా నుంచి బయటపడుతామని తెలిపారు. ఇలాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు 70 రోజుల పాటు కంట్రోల్ చేయగలిగితే దానిని పూర్తిగా కట్టడి చేయొచ్చని వెల్లడించారు.
ప్రజలంతా భౌతిక దూరం పాటించి మరికొన్నాళ్లు స్వీయ నియంత్రణతో ముందుకు సాగాలని కోరారు. కేంద్రం లాక్ డౌన్ లో సడలింపులు ప్రకటించిందని, వాటిని యథావిధిగా అమలు చేస్తామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు.
రెడ్ జోన్లలోనూ షాపులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, కానీ మన రాష్ట్రంలో ఏవీ తెరవడానికి లేదన్నారు. నిర్మాణ పనులు తప్ప ఎటువంటి షాపులు తెరవడానికి లేదన్నారు. తెలంగాణలో ఆరు జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ లో ఉన్నాయని, మిగిలిన 27 జిల్లాలు ఆరెంజ్, గ్రీన్ జోన్లలోకే వస్తాయని చెప్పారు.