తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు పరీక్షలను రద్దు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జూలై 31 తర్వాత సంబంధిత కాలేజీల నుంచి మార్కుల మెమోలను పొందవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెమోలను 10 రోజుల తర్వాత అందిస్తామని చెప్పారు.
అంతకుముందు.. తెలంగాణలో ఇప్పటికే పది పరీక్షలు, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఇటీవలే ఆదేశాలు జారీచేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ఎస్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి, వాటిని రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం తరపున ఏజీ తెలిపారు.