ఇటీవల జరిగిన తెరాస ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తమ పాలన కోరుకుంటున్నారని వ్యాఖ్యానించగా, ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ... సీఎం కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని, అయితే రెండు రాష్ట్రాలను కలిపేసేలా ఆయన ఓ తీర్మానం చేస్తే బాగుంటుందన్నారు.
దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు.
తెరాస ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తీసుకురావడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్రలో భాగమని మండిపడ్డారు. ఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు. కేసీఆర్, పేర్ని నానిల కామెంట్లను కూడా వీడియో రూపంలో రేవంత్ రెడ్డి షేర్ చేశారు.