టీ20 ప్రపంచకప్: ఆస్ట్రేలియా విజయం - Newsreel

శుక్రవారం, 29 అక్టోబరు 2021 (08:16 IST)
ఐసీసీ ప్రపంచకప్ గ్రూప్-1 లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (42 బంతుల్లో 65; 10 ఫోర్లు) అర్ధసెంచరీతో చెలరేగడంతో మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్లతో విజయం సాధించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ 2, దసున్ షనక ఒక వికెట్ తీశారు.

 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు సాధించింది బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), చరిత్ అసలంకా (27 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), భానుక రాజపక్స (26 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలా 2 వికెట్లు తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆడమ్ జంపాకు లభించింది.

 
వార్నర్ హాఫ్ సెంచరీ
155 పరుగుల లక్ష్యఛేదనను ఆస్ట్రేలియా ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు వార్నర్, ఆరోన్ ఫించ్ చెలరేగి ఆడారు. తొలి ఓవర్లోనే ఫించ్ రెండు బౌండరీలు బాదగా, మరుసటి ఓవర్‌లో మరో ఫోర్ కొట్టాడు. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఫించ్ వరుసగా 4,6 ... వార్నర్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి.

 
ఆ తర్వాతి ఓవర్‌లో ఫించ్ లాంగాన్ మీదుగా మరో సిక్సర్, ఫోర్ బాదడంతో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా 63/0 పరుగులు చేసింది. కాసేపటికే ఫించ్ అవుటైనప్పటికీ, వార్నర్ జోరు మాత్రం తగ్గలేదు. వ్యక్తిగత స్కోరు 18 పరుగుల వద్ద వార్నర్ అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. వికెట్ కీపర్ కుశాల్ పెరీరా క్యాచ్ వదిలేయడంతో వార్నర్ బతికిపోయాడు. పించ్ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (5) నిరాశపరిచాడు.

 
స్మిత్‌ (26 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన వార్నర్ 31 బంతుల్లోనే అర్ధసెంచరీని అందుకున్నాడు. ఓ ఎండ్‌లో స్మిత్ ఆచితూచి ఆడుతున్నప్పటికీ, వార్నర్ అప్పుడప్పుడు బౌండరీలతో అలరించాడు. ఈ జంట 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక... షనక బౌలింగ్‌లో రాజపక్స అద్భుత క్యాచ్ అందుకోవడంతో వార్నర్ పెవిలియన్ చేరాడు. అప్పటికీ ఆసీస్ విజయానికి 30 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది. ఇక మిగతా లాంఛనాన్ని స్టొయినిస్ (7 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేశాడు. మరో 18 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు.

 
లంక జట్టులో రాణించిన అసలంకా, పెరీరా
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మూడో ఓవర్‌లోనే ఓపెనర్ పథుమ్ నిసంక (7) వికెట్‌ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన అసలంకా దూకుడు ప్రదర్శించాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఫోర్‌తో పాటు మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో 6, 4తో మొత్తం 16 పరుగులు రాబట్టాడు. అనంతరం హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో మరో బౌండరీ బాదాడు.

 
అసలంకా అండగా పెరీరా కూడా నెమ్మదిగా దూకుడు పెంచాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఒక ఫోర్, స్టొయినిస్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని జంపా విడగొట్టాడు. జట్టు స్కోరు 78 పరుగుల వద్ద అసలంకా అవుటయ్యాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 44 బంతుల్లో 63 పరుగులు జోడించారు.

 
మరుసటి ఓవర్లోనే పెరీరా కూడా పెవిలియన్ చేరాడు. స్టార్క్ బౌలింగ్‌లో స్టాండ్స్‌లోకి భారీ సిక్సర్ బాదిన పెరీరా, తర్వాతి బంతికే దొరికిపోయాడు. 144కి.మీ వేగంతో స్టార్క్ సంధించిన అద్భుతమైన ఇన్‌స్వింగింగ్ యార్కర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. అవిష్క ఫెర్నాండో (4), వనిందు హసరంగ డి సిల్వా (4) వెంటవెంటనే అవుటయ్యారు.

 
ఓవైపు దసున్ షనక (12) పరుగులు చేయడానికి తడబడుతుంటే, క్రీజులోకి వచ్చిన రాజపక్స మాత్రం ధాటిగా ఆడాడు. స్టొయినిస్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో చెలరేగాడు. దీంతో ఆ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. షనక వికెట్ తీయడంతో పాటు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో చివరి రెండు ఓవర్లలో లంక కేవలం రెండు ఫోర్లు మాత్రమే కొట్టగలిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు