తెలంగాణాలో దంచికొడుతున్న వాన.. మరో 4 రోజులు వర్షాలే...

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో వాన దంచికొడుతోంది. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో తాత్కాలిక పునరావస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నది. ఇది మరింత బలపడటంతో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. 
 
సోమవారం రాత్రి జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 184.3, జగిత్యాలలో 175.5 మిల్లీ మీటర్ల భారీ వర్షాపాతం నమోదైంది. అలాగే పలు మండలాల్లోనూ 90 మిల్లీ మీటర్లకుపైగా వర్షం కురిసింది. వానకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. 
 
అనంతారం వాగుపై నుంచి నీరు ప్రవహించడంతో జగిత్యాల-ధర్మపురి మధ్య, చల్‌గల్‌ వద్ద ఒర్రె ఉధృతంగా పారడంతో జగిత్యాల - రాయికల్ మధ్య, గుల్లపేట - పొలాస మధ్య వంతెనపై నుంచి నీళ్లు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నాగిరెడ్డిపేటలో 118.5 మి.మీ వర్షాపాతం నమోదైంది. 
 
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బోయినపల్లిలో 100 మిమీ, జిల్లాకేంద్రంలో 82.5 మి.మీ వర్షం కురిసింది. నారాయణపేట, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. 
 
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమరం భీమ్, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు