సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న తమకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ధైర్యం చెప్పారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి చెప్పారు.
ఆర్టీసీ జేఏసీ నాయకులు గవర్నర్ ను కలుసుకొని తమ డిమాండ్లు, సమ్మెపై నివేదిక ఇచ్చారు. గవర్నరుతో భేటీ అనంతరం అశ్వథామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోర్డ్ అనుమతి లేకుండా సమ్మెలో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా అద్దె బస్సులకు టెండర్లకు పిలిచారని గవర్నరుకు చెప్పామన్నారు. కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులను ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. జేఏసీ కార్యాచరణ విజయవంతమైందని, తమకు మద్దతు తెలిపినవారందరికీ ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. జూబ్లీ బస్ స్టేషన్ లో రేపు వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఆర్టీసీని లాకౌట్ చెయ్యడానికి ఎవరికీ అధికారం లేదని, ఆర్టీసీ ఆస్తులు కార్మికుల ఆస్తులని చెప్పారు. ఆర్టీసీ పై కన్నేసి ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఆర్టీసీని లాకౌట్ చేస్తామంటే భయపడే ప్రస్తకే లేదన్నారు.
గవర్నర్ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు దేశ వ్యాప్తంగా అందరి సహకారం ఉందన్నారు. కో కన్వీనర్ వీఎస్ రావు మాట్లాడుతూ గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారని, సింగరేణి కార్మికులను త్వరలో కలుస్తామని చెప్పారు. జేఏసీ మహిళా కన్వీనర్ సుధా మాట్లాడుతూ ఎవ్వరి ప్రలోభాలకు లొంగవద్దని గవర్నర్ చెప్పారని అన్నారు.