#WorldOrganDonationDay : ఐదుగురి ప్రాణాలు కాపాడిన బుడతడు

శుక్రవారం, 13 ఆగస్టు 2021 (10:51 IST)
ప్రతి యేటా ఆగస్టు 13వ తేదీని వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే (ప్రపంచ అవయవ దాన దినోత్సవం)ను నిర్వహిస్తుంటారు. అయితే, ఈ మహత్తరమైన డేకు ఒక రోజు ముందు 13 యేళ్ల బుడతడు ఏకంగా ఐదుగురి ప్రాణాలు కాపాడాడు. తన అవయవాలను దానం చేసి ఐదుగురి ప్రాణం పోశాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం, భద్రాచలం పరిధి కొత్తకాలనీ అశోక్‌నగర్‌కు చెందిన కొయ్యల సిద్దార్థ (13)కు ఈ నెల 17న అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, వాంతులు వచ్చాయి. అతడిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
 
వైద్యులు అత్యవసర వైద్యం అందించినప్పటికీ బాలుడి పరిస్థితి మెరుగుపడలేదు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 48 గంటల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మార్పు రాలేదు.
 
అయితే బాలుడికి ‘హైపెక్స్‌ బ్రెయిన్‌ ఇన్‌జురీ’ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 21న బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్‌ సభ్యులు అవయవదానంపై తల్లి సీతకు అవగాహన కల్పించడంతో ఆమె అంగీకరించారు. 
 
దీంతో బాలుడి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలు సేకరించి ప్రాణాపాయంలో ఉన్న ఐదుగురికి అమర్చి వారి ప్రాణాలను కాపాడారు. వరల్డ్ ఆర్గాన్ డోనర్స్ డేకు ముందు తమ కుమారుడి అవయవాలు ఐదుగురి ప్రాణాలు రక్షించడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు