వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్రను ప్రారంభించనున్నారు. 2003లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర చేపట్టారు. 2012లో షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. 230 రోజులపాటు 116 నియోజకవర్గాల్లో 3,112 కిలోమీటర్లు చుట్టివచ్చారు.
మరోవైపు నిర్మాణపరంగా ఇతర పార్టీలు జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటే... వైతెపా పార్లమెంట్ స్థానాలను ఎంచుకుని.., వాటికి కన్వీనర్లు, కోకన్వీనర్లను ప్రకటించింది. ప్రస్తుతం పాదయాత్ర కూడా హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది.
ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా తొలి రోజున చేవెళ్ల.. వికారాబాద్ రోడ్డులోని కేజీఆర్ గార్డెన్ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, వైఎస్ అభిమానులను తరలించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ.., అనంతరం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది.