ఎ.ఆర్. రెహమాన్‌కు సుశీల సన్మానం

"స్లమ్‌డాగ్ మిలీయనీర్" సినిమాతో ఆస్కార్ అవార్డు పొందిన ఎ.ఆర్. రెహమాన్‌కు సుప్రసిద్ధ గాయని గానకోకిల, పి. సుశీల ఆత్మీయ సత్కారం చేయనున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ మారియెట్ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ఎ.ఆర్. రెహమాన్‌ను గౌరవించనున్నట్లు సుశీల విలేకరులతో తెలిపారు.

ఈ విషయమై సుశీల మాట్లాడుతూ.. ప్రపంచమంతా రెహమాన్ పేరు మారుమోగి పోతుందని, భారతీయుడిగా ఆస్కార్ అవార్డు గెలుపొందిన రెహమాన్‌ను సత్కరించాలనుకున్నానని చెప్పారు. రెహమాన్‌ ఆస్కార్ గెలుచుకున్న వెంటనే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నానని చెప్పగానే, వద్దని చెప్పకుండా రెహమాన్ అంగీకరించారని సుశీల వెల్లడించారు. అయితే ఓపెన్ ఫంక్షన్‌లు వద్దని, ఇన్‌డోర్ ఫంక్షన్ చేయమని సూచించారు. ఆయన సూచనమేరకే మేరియేట్ హోటళ్లో రెహమాన్ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సుశీల వివరించారు.

ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దేవుని అనుగ్రహం కావాలని, రెహమాన్‌ సంగీతంలో తాను పాడలేనని, అయితే తన కోడలు సంధ్య ఆయన సంగీతం సమకూర్చిన "ఇరువర్" అనే తమిళ సినిమాలో గాయనిగా పరిచయం అయిందని సుశీల తెలియజేశారు.

సంధ్య మాట్లాడుతూ.. రెహమాన్ సంగీత దర్శకత్వంలో తొలిసారిగా పాడానని, సుశీల పిలుపు మేరకే రెహమాన్ ఈ సన్మాన కార్యక్రమంలో హాజరవుతున్నారన్నారు. పాప్, వెస్ట్రన్, క్లాసికల్, సూఫీ వంటి అన్ని రకాల సంగీతాల్ని చేయగలిగే సంగీత మాంత్రికుడు అయిన రెహమాన్‌ను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమాన్ని తిరుమల మ్యూజిక్ కంపెనీ (టి.ఎం.సి), మాటీవీ, మేరియెట్ హోటల్‌లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. రెహమాన్ సన్మాన కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడం పట్ల టి.ఎం.సి, మాటీవీ, మేరియెట్‌లు హర్షం వ్యక్తం చేశాయి.

వెబ్దునియా పై చదవండి