ఘనంగా విజయనిర్మల జన్మదిన వేడుకలు

శుక్రవారం, 20 ఫిబ్రవరి 2009 (18:26 IST)
WD
అలనాటి అందాల నటి, దర్శకురాలిగా గిన్నీస్‌బుక్‌లో అర్హత సాధించిన విజయనిర్మల జన్మదిన వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. శుక్రవారం విజయనిర్మల పుట్టినరోజును పురస్కరించుకుని, ఆమె జన్మదిన వేడుకలను నానక్‌రామ్‌గూడా విలేజ్ సమీపానగల ప్లానెట్-10లో కృష్ణ, మహేష్ బాబు అభిమానులు వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు నరేష్ మాట్లాడుతూ.. ప్రతిభావంతమైన నటిగా, దర్శకురాలిగా పేరొందిన విజయనిర్మలకు భవిష్యత్తులో పద్మశ్రీ అవార్డు లభించాలని ఆకాంక్షించారు. ఇదే అభిప్రాయాన్ని సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కూడా వ్యక్తం చేశారు.

దీనిపై విజయనిర్మల స్పందిస్తూ.. ఈ పుట్టినరోజును ప్రత్యేకంగా భావిస్తున్నానని చెప్పారు, కృష్ణకు పద్మభూషణ్ రావడంతో పాటు అంతకుముందే డాక్టరేట్, ఎన్టీఆర్ అవార్డులు దక్కడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం "నేరము-శిక్ష" చిత్రం చేస్తున్నానని, షూటింగ్ చివరిదశలో ఉందన్నారు. చక్కని కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతుందని వెల్లడించారు.

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఏడాదీ అభిమానులు భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారని, వారందరికీ ఈ రోజు పండుగలా ఉందని చెప్పారు. అందరికీ ఈ సందర్భంగా కృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. తనకు పద్మభూషణ్ అవార్డు లభించడంపై కృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి