దాసరిచే కమల్, వెంకీల "ఈనాడు" లోగో ఆవిష్కరణ

WD
దశావతారం హీరో పద్మభూషణ్ కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్‌లు నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం "ఈనాడు".

హిందీలో ఘన విజయం సాధించిన "వెడ్నెస్‌డే" చిత్రాన్ని తెలుగులో "ఈనాడు"గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలోగో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి లాంఛనంగా జరిగింది. లోగోను దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.

అమ్మక్రియేషన్స్ పతాకంపై కుమారస్వామి నిర్మిస్తున్న ఈ సినిమా గురించి లోగో ఆవిష్కరణ సందర్భంగా దాసరి నారాయణ రావు మాట్లాడుతూ.. సినీ రంగంలో ఎందరో ఆర్టిస్టులున్నా.. కమల్ హాసన్‌లాంటి అద్భుత నటనకు ఆయనే సాటి అని దాసరి కితాబిచ్చాడు. జాతీయనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ తెలుగులో ప్రత్యక్షంగా సినిమా చేయాలని కోరారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ.. తాను నిర్మించిన ఇంద్రుడు-చంద్రుడు చిత్రంలో కమల్‌హాసన్ నటించారని చెప్పారు. అప్పట్లోనే ఆయనలోని పట్టుదల, ఇన్‌వాల్వ్‌మెంట్ ఎలాంటిదో గ్రహించానని అన్నారు. అంతేగాక అసిస్టెంట్ డైరక్టర్ లక్షణాలు కమల్‌లో కనిపించేవని గుర్తు చేసుకున్నారు.

ఒకసారి కమల్ ఫోన్‌చేసి తాను వెడ్నెస్‌డే చిత్రం చేస్తున్నానని, అందులో వెంకటేష్ కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ఆ పాత్ర గురించి వెంకటేష్‌కు చెపితే ఆ చిన్నపాటి పాత్రను "నేను చేయనని.." చెప్పేశాడని రామానాయుడు అనడంతో సభికులందరూ నవ్వేశారు.

ఆ తర్వాత ఆ పాత్ర నిడివి, మలయాళంలో మోహన్ లాల్ ఇదే పాత్రను పోషిస్తున్నాడని చెప్పడంతో ఆ రోలే చేసేందుకు అంగీకరించాడని రామానాయుడు చెప్పుకొచ్చారు. మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. నటుడిగా తనకు కమల్ హాసన్ స్ఫూర్తి అని, ఆయన్ని చూసే నటనలోని మెలకువలను నేర్చుకున్నానని చెప్పారు. ఆయన్ని చూస్తే హావభావాలను నవరసాలను ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నానని వెంకీ తెలిపారు. ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మల్టీస్టారర్ సినిమా వస్తుందని ఆశిస్తున్నట్లు వెంకీ వెల్లడించారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. తెలుగులో తనకు రామానాయుడు, దాసరి నారాయణరావుతో గల సంబంధాన్ని నెమరువేసుకున్నారు. దర్శకరత్న కోరిన తరహాలో త్వరలో రాజ్ కమల్ మూవీస్ పతాకంపై ప్రత్యక్షంగా ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నానని చెప్పారు.

"వెడ్నెస్‌డే" చిత్రాన్ని రీమేక్ చేయడానికి కారణం ఎందుకని, హిందీలో తీసిన సినిమాను మళ్లీ తీయడమెందుకని? చాలామంది అడిగారని కానీ.. కథాంశమును బట్టి నజారుద్దీన్, నానా పటేల్ స్టైల్లో కాకుండా విభిన్నంగా తెరకెక్కిస్తున్నట్లు కమల్ హాసన్ అన్నారు. ఫలితం ఆశించినట్లే సానుకూలంగా ఉంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఇకపోతే.. "భూమిక" నటించిన మిస్సమ్మ సినిమాకు దర్శకత్వం వహించిన నీలకఠం "ఈనాడు" చిత్రానికి అద్భుతంగా మాటలు రాశాడని కమల్ తెలిపారు. సెప్టెంబరులో ఆడియోను విడుదల చేసి అదే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి