దాసరిచే 'వీడు మనవాడే' ఆడియో విడుదల

శ్యామ్‌, మల్లికాకపూర్‌ జంటగా నేతాజీ దర్శకత్వంలో సి. విజయకుమార్‌ నిర్మించిన 'వీడు మనవాడే' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథి డా|| దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలిప్రతిని మరో దర్శకుడు సాగర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా దాసరి చిత్ర టైటిల్‌ గురించి ప్రస్తావిస్తూ, తన దృష్టిలో పక్కనున్నవాడుకూడా మనవాడేనని భావిస్తాననీ, బహుశా ఆ కోవలోనే చిత్ర దర్శకుడు నేతాజీ అందరూ మనవారే అనే కాన్సెప్ట్‌తో పేరు పెట్టి ఉంటారని అభివర్ణించారు.

నేతాజీతో తనకున్న దర్శకత్వ అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ముందుగా ఆయన మంచి కథకుడనీ, అందులోంచే దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్నారనీ, పలుచిత్రాలకు దర్శకత్వం కూడా వహించారని పేర్కొన్నారు. నేతాజీ దర్శకత్వం వహించిన 'ధ్వని-ప్రతిధ్వని' చిత్రంలో కృష్ణంరాజు కాంబినేషన్‌లో తాను నటించాననీ, కొన్ని కారణాలవల్ల అది షూటింగ్‌కు నోచుకోలేదని వివరించారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన దిన తను దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు సంగీతం సమకూర్చి విజయంలో భాగస్వామి అయ్యాడని తెలిపారు. సంగీతదర్శకులు కాకమునుపు వారు ఏదోఒక దానిలో ప్రావీణ్యం సంపాదించుకుంటారనీ, అలా కీబోర్డు ప్లేయర్‌ దిలీప్‌ రెహమాన్‌గా మారారనీ, గిటార్‌ప్లేయర్‌ ఇళయరాజా దర్శకునిస్థాయికి ఎదిగారనీ ఉటంకిస్తూ... ఆ కోవలో దిన దినదినాభివృద్ధి చెందారని ప్రశంసించారు.

'కిక్'లో సెకండ్‌హీరోగా చేసిన శ్యామ్‌ ఈ చిత్రంలో హీరోగా నటించడం మంచి పరిణామమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు సూర్యకిరణ్‌, సింధూరపువ్వు నిర్మాత కృష్ణారెడ్డి , నేతాజీతో తమకున్న పరిచయాన్ని వివరించారు.

దిన మాట్లాడుతూ, 'ఒసేయ్ రాములమ్మ' తర్వాత 15ఏళ్ళకు దాసరి అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ... తమిళంలో ఈ చిత్రం పాటలు ప్రజాదరణ పొందాయనీ, తెలుగులోకూడా ప్రజాదరణ పొందుతాయనే నమ్మకాన్ని వెలిబుచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నటి కళ్యాణి, నటుడు విజయభాస్కర్‌, చైన్నై లా కాలేజీ ప్రొఫెసర్‌ జాన్సన్‌ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంద్వారా ఆడియో విడుదలైంది.

వెబ్దునియా పై చదవండి