భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఠాగూర్

ఆదివారం, 11 మే 2025 (11:51 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవశోభతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిప్రదక్షిణ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. వీరంతా చేసిన జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకట్రావు ఈ కార్యక్రమానికి స్వయంగా నేతృత్వం వహించారు. 
 
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పలు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, భక్త సమాజాలకు చెందిన సభ్యులు, సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గోమాతను ముందుంచుకుని, జాతీయ పతాకాన్ని చేతబూని, స్వామివారి నామస్మరణ చేస్తూ, భక్తి ప్రపత్తులతో కొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణ పూర్తిచేశారు. భక్తుల కోలాహలంతో యాదగిరి కొండ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.
 
గిరి ప్రదక్షిణ ముగించుకున్న అనంతరం భక్తులందరూ కొండపైకి చేరుకుని ప్రధాన ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో వెంకట్రావు మాట్లాడుతూ నరసింహ జయంతి ఉత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ అని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు