శింబు, ప్రభుదేవాలను కాదన్న నయనతార విఘ్నేష్‌తో జత కట్టేనా...

గురువారం, 29 జూన్ 2017 (07:18 IST)
ప్రేమికుడు ఎంత గొప్పవాడయినా సరే అమర్యాదకరంగా వ్యవహరిస్తే చాలు తన్ని తరిమేసే సాహసం నయనతారది. గతంలో ఇలాగే ఆమెకు దగ్గరై పోకిరీ పని చేసిన తమిళ హీరో శింబును పదేళ్లు తన వద్దకు కూడా రాకుండా చేసింది నయనతార. ఇక ప్రభుదేవా అయితే తన భార్య పిల్లలను పణంగా పెట్టి వివాహ బంధం కూడా తెంచుకుని నయన చెంతకు చేరాడు కానీ ఏం తేడా వచ్చిందో తెలీదు. ఆరునెలల్లోపే జాడించేసింది. అలాంటిది తనకంటే ఏడాది చిన్నవాడైన విఘ్నేష్‌‌తో ప్రేమలో పడింది. ఖచ్చితంగా వీరిద్దరూ ఒకటవుతారని కొలీవుడ్ కోడై కూస్తోంది. 
 
నయనతార కంటే వయసులో ఏడాది చిన్నోడయినా... బోలెడంత ప్రేమను నయనకు పంచి, ఆమె ప్రేమను సంపాదించి ఒక్కసారిగా వార్తల్లో పెద్దోడయ్యాడు తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌. సాయంత్రం వేళకు ఓ గూటికి చేరే పక్షుల వలే... సన్‌ సెట్‌ కాగానే సినిమా సెట్‌ నుంచి విఘ్నేశ్, నయనలు స్ట్రయిట్‌గా ఓ గూటికి చేరి ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారట. చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాలు వీళ్ల ప్రేమకథ గురించి కథలు కథలుగా చెబుతున్నాయి.
 
 వీళ్లిద్దరూ ఈ కథలకు తగ్గట్టుగా మలయాళీ ఓనమ్, తమిళ పొంగల్‌ ఫెస్టివల్స్‌ను కలిసే సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రేమలో ఆల్మోస్ట్‌ రెండేళ్లు గడిచాయేమో... మూడో ఏడు వచ్చేసరికి ఏడడుగులు వేసేయాలని విఘ్నేశ్, నయనలు నిశ్చయించుకున్నారని వార్తలొచ్చాయి. అబ్బే... అటువంటిది ఏం లేదని విఘ్నేష్‌ శివన్‌ క్లారిటీ ఇచ్చారు.
 
 ప్రస్తుతానికి కెరీర్‌ గురించి తప్ప... కల్యాణం గురించి ఆలోచించడం లేదని ఆయన సెలవిచ్చారు. అంతా బాగానే ఉంది.. ‘నయనతారను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను’ అనలేదు కాబట్టి, ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న మాట నిజమే అన్నమాట. ఏదేమైనా... ఇప్పట్లో నయనతార పెళ్లి లేనట్లే!! ఇంకో మూడు నాలుగేళ్లు కెరీర్‌పైనే దృష్టి పెడతారన్నమాట!
 

వెబ్దునియా పై చదవండి