ప్రముఖ దర్శకుడు కష్ణవంశీ దర్శకత్వంలో బాలకష్ణ కథానాయకుడుగా నటించే భారీ చిత్రం 'రైతు'లో నటించడానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో అమితాబ్ లాంటి స్టేచర్ ఉన్న నటుడు నటిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో బాలకష్ణ, కష్ణవంశీ వెళ్ళి ఆయనను కలిశారు. నందమూరి కుటుంబం పట్ల ఉన్న అభిమానంతోనూ, చిత్రంలోని పాత్ర నచ్చడంతోను ఈ సినిమాలో నటించడానికి అమితాబ్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ఫిబ్రవరి నెలలో 17 రోజుల కాల్ షీట్స్ కూడా ఆయన అప్పుడే కేటాయించినట్టు సమాచారం. దీంతో ముందుగా అమితాబ్ వుండే సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. గతంలో 'మనం' సినిమాలో అమితాబ్ కాసేపు కనిపించినప్పటికీ, ఒక తెలుగు సినిమాలో ఆయన పూర్తి నిడివి పాత్ర పోషించడం మాత్రం ఇందులోనే అని చెప్పచ్చు. ఏమైనా, ఈ బాలీవుడ్ దిగ్గజం 'రైతు' సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.