వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకి ఒక ఆలోచన వస్తే సినిమా తీసేస్తాడు. ఏ ఆలోచన రాకపోతే ఓ ట్వీట్ చేసి జనాల్ని ఉలిక్కిపడేలా చేస్తాడు. ఏది ఏమైనా మన రాంగోపాల్ వర్మ మాత్రం ఏదో రకంగా అనునిత్యం న్యూస్‌లో ఉండేలా జాగ్రత్త పడుతాడు. సినీ ఇండస్ట్రీలో అందరి మీద వివాదస్పద వాఖ్యలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ మరో సారి వివాదాన్ని రేపాడు.
ప్రస్తుతం వంగవీటి సినిమాతో బిజీగా ఉన్న వర్మ దృష్టి ఈ సారి దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌పై పడింది. రజనీకాంత్ ఇన్నాళ్ళు స్టైల్‌తోనే సినీ పరిశ్రమలో నెట్టుకు వచ్చాడని, ఆయన ఎంత ట్రై చేసినా కన్నడ హీరో సుదీప్‌లా నటించలేడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
అసలు విషయం ఏంటంటే... కన్నడ స్టార్ హీరో సుదీప్ తాజాగా నటించిన చిత్రం ''కోటి గొబ్బ -2''. ఆ చిత్రాన్ని చూసిన వర్మ... సుదీప్ నటనని రజినీకాంత్‌తో పోల్చాడు. రజినీ కేవలం స్టైల్‌తో నెగ్గుకు వస్తున్నాడని సుదీప్‌లా నటించడం రజినీకి చేతకాదు అంటూ విమర్శించాడు. సుదీప్ నటనను మెచ్చుకోవచ్చు కానీ ఇలా సూపర్ స్టార్‌ను విమర్శించడం భావ్యం కాదని అభిమానులు మండిపడుతున్నారు.