సుకుమార్ - రామ్‌చరణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సినిమా కోసం హీరో రామ్ చరణ్ గుబురు గడ్డంతో దర్శనమివ్వబోతున్నాడు. ఇదివరకే సుక్కు తీసిన నాన్నకు ప్రేమతో సినిమాలో జూ.ఎన్టీయార్ ఇదే లుక్‌తో కనిపించాడు. ఈ సినిమాలో నాన్న సెంటిమెంట్ చూపెట్టాడు. ఇప్పుడు రాబోయే చిత్రం మోషన్ పోస్టర్ చూస్తే రామ్ చరణ్ కాస్త శ్రీమంతుడులో మహేష్ బాబులా లుంగీ కట్టి కావడి కుండలు మోస్తున్నట్లు ఉన్నది.
అలాగే అత్తారింటికి దారేది సినిమాలో ఎన్నారై హీరో తాతకు అత్తని దగ్గర చేసి, కుటుంబ సభ్యుల ప్రేమలు ఎలా ఉంటాయో చూపారు. ఇప్పుడు ఈ సినిమాలో అన్నింటినీ మేళవించి రామ్‌చరణ్‌తో చేస్తున్నట్టుంది. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం- దేవిశ్రీప్రసాద్, డి.ఓ.పి - రత్నవేలు. గతంలో మిర్చి, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.