నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తోన్న ఈ మూవీకి తేజని డైరెక్టర్‌గా ప్రకటించడం... ఇటీవల తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఎనౌన్స్ చేయడం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌కి డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
రాఘవేంద్రరావు, పి.వాసు, క్రిష్, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్.. ఇలా పలువురు పేర్లు పరిశీలించారు. కానీ.. ఎవరు కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ని డైరెక్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఉన్నవి వున్నట్లుగా చూపిస్తే చాలా తేడాలు వస్తాయని ఇప్పటికే వైకాపా నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా మనకెందుకులే అని దర్శకులు బయోపిక్ చిత్రానికి దర్శకత్వం వహించాలని అడిగితే ముఖం చాటేస్తున్నారట.
దీంతో వేరే డైరెక్టర్ ఎందుకు నేనే చేసేయవచ్చు కదా అని బాలయ్య ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాని జూన్ నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని బాలయ్య నిర్మిస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ కూడా బాలయ్యే అయితే... అభిమానులకు పండగే. కాకపోతే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డైరెక్టర్‌గా బాలయ్య న్యాయం చేయగలరా అనేది ఆలోచించాల్సిన విషయం. మరి... ప్రచారంలో ఉన్నట్టు బాలయ్య డైరెక్టర్ అనేది నిజమా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!