బాహుబలి వంటి భారీ చిత్రాలు టాలీవుడ్ ఇండస్ట్రీకి లాభమా నష్టమా...

మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (16:20 IST)
ఇప్పటికే తెలుగు చలనచిత్ర సీమను నాలుగు కుటుంబాలు మాత్రమే ఏలుతున్నాయని అపనిందలను మూటగట్టుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ కొత్తగా అతి భారీ చిత్రాల నిర్మాణాల మత్తులో మునిగి చిన్న చిత్రాల ఊసు లేకుండా తెరపైన కళాకారులే కాకుండా తెర వెనుక కళాకారులలో కూడా ఎక్కువమంది పొట్ట కొడుతోందనే మరో అపనిందను పొందబోతోందనే చర్చ జరుగుతోంది.
 
సంవత్సరాల తరబడి తీసిన బాహుబలి, బాహుబలి-2ల వంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌ల వలన లాభాలేవైనా ఉంటే సదరు చిత్ర యూనిట్‌ల వరకే పొందుతాయని... అదే కాలంలో సదరు నిర్మాతలు, దర్శకులు ఒక నాలుగైదు సినిమాలు నిర్మించి ఉంటే అంతకు రెట్టింపు మంది కళాకారులు ఆ చిత్రాలలో నటించి పొట్టపోసుకుని ఉండే వారని సదరు విమర్శకుల వాదన.
 
ఒకవైపు సైలెంట్‌గా వచ్చి పెద్ద హిట్లు సాధించిన చిన్న సినిమాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని నానీ, నిఖిల్ లాంటి హీరోలు నిరూపిస్తూనే ఉన్నారు. కథ, కథనం, దర్శకత్వం బాగుంటే చిన్నవైనా చాలు అలా కాకుండా అనవసరంగా పెద్ద బడ్జెట్‌లలో మునిగి ఆ సినిమాలు కాస్తా అటోఇటో అయితే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా తయారవుతుందనే భయం కూడా లేకపోలేదు. ఎన్ని చెప్పినా ఎవరి లెక్కలు వారివి... ఎవడెట్టా పోతే మాకేంటి అనేది వ్యాపారంలో వుండనే వుంది కదా.

వెబ్దునియా పై చదవండి