హీరోగా పరిచయమై.. ఆ తర్వాత విలన్‌గా కనిపిస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ఈయన ప్రతి నాయకుడిగా నటించిన 'సరైనోడు', 'నిన్ను కోరి' వంటి చిత్రాలూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పైగా, విలన్‌గా మంచి నటనను కనబరుస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో గత సంక్రాంతికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రంలోనూ ముఖ్య పాత్రని పోషించాడు. ఇందులో తన పాత్ర చాలా భిన్నంగా ఉంది.
ఇకపోతే, తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన "రంగస్థలం"లోనూ కీలక రోల్ చేస్తున్నాడు. ఆయన పాత్రకి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చరణ్‌కి అన్నయ్యగా కె.కుమార్ బాబు పాత్రలో యువ రాజకీయ నేతగా ఆది కనిపించనున్నాడు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆది పినిశెట్టి డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తుండగా, పోస్టర్‌పై రంగస్థలం గ్రామ పంచాయితీ ఎన్నికలలో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా గ్రామ పజలు బలపరిచిన కె.కుమార్ బాబు 'లాంతరు' గుర్తుకే మీ ఓటు ముద్రని వేసి గెలిపించండి అని రాసి ఉంది.
అంటే గ్రామ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసే పాత్రలో ఆది కనిపించనున్నాడన్నమాట. 'రంగస్థలం' చిత్రం పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కగా, తాజాగా విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఆ నాటి పరిస్థితులకే తగ్గట్టుగానే సినిమా రూపొందిందని గుర్తు చేస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. సమంత హీరోయిన్. ఈనెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.