కన్నడ బుల్లితెర హాస్య నటుడు, 'కామెడీ ఖిలాడీగాలు' ఫేమ్ చంద్రశేఖర్ సిద్ధి (28) భార్య చీపురుతో కొట్టిందన్న అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యల్లాపుర తాలూకా వజ్రళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిమనళ్లికి చెందిన సిద్ధి జులై 31న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యల్లాపుర తాలూకాలోని కట్టిగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్నాడు. కొన్ని నెలలుగా అతడు మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అప్పట్లో పోలీసులు తెలిపారు.
2020లో 'కామెడి ఖిలాడీగాలు' సీజన్-3లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ షో తర్వాత పలు టీవీ సీరియళ్లలోనూ నటించాడు. అయితే, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆందోళనకు లోనయ్యాడని, ఇల్లు గడిచేందుకు ఇటీవల అతడు దినసరి కూలీగా కూడా మారాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రతిష్టాత్మక నిసామ్ థియేటర్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన చంద్రశేఖర్ సిద్ధి నటనపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. గత మూడు నెలలుగా అతడు మానసిక ఆందోళనతో ఉన్నాడని, ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ భావించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్య అతడితో గొడవపడి చీపురు, కట్టెతో కొట్టడంతో ఆవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నట్టు యల్లాపుర రూరల్ పోలీసులు తాజాగా వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు.