''బాహుబలి'' హీరో, డార్లింగ్ ప్రభాస్‌కు నేడు (అక్టోబర్ 23) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మిర్చి హీరో గురించి.. ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లోకి రాకముందు ఓ పుట్టినరోజు పార్టీలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు నేను, ప్రభాస్ పోటీపడి డ్యాన్స్ చేశామని చెప్పారు. సినిమాల్లోకి రావడం ప్రభాస్ ఇష్టమని చెప్పడంతోనే అతనిని ఈ ఫీల్డులోకి తీసుకొచ్చానని చెప్పారు.
వైజాగ్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్న ప్రభాస్.. ఆపై బాహుబలి స్థాయికి ఎదిగిపోయాడన్నారు. సాధారణంగా ఓ తండ్రి కుమారుడిని ఐదు సంవత్సరాల వరకు దేవుడిలా చూడాలి. ఐదు నుంచి 18 సంవత్సరాల వరకు బానిసగా చూడాలి. 18 నుంచి స్నేహితుడిగా చూడాలని మా నాన్నగారు అంటూ వుండేవారు. ఈ పద్ధతిలోనే తాను కూడా ప్రభాస్‌ను చూస్తున్నానని కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
ప్రభాస్ తన వారసుడని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని కృష్ణంరాజు వెల్లడించారు. ప్రభాస్‌లో ఆ మూడే తనకు నచ్చుతాయని కృష్ణంరాజు అన్నారు. ప్రభాస్ అంకిత భావంతో పనిచేసే ఆర్టిస్ట్. తన సుఖం గురించి ఆలోచించని వ్యక్తి. వ్యక్తిగతంలో మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడే తత్త్వం ప్రభాస్‌కు లేదు. ఇక సినిమా కోసం సంప్రదిస్తే కథను విన్నాకే అన్నీ చేస్తాడు. ఆ కథ విన్న తర్వాత అది బాగుందో? లేదో? చెప్పడం మామూలు విషయం కాదు.
అలా జడ్జ్ చేయడంలో ప్రభాస్ పర్ఫెక్ట్ అంటూ కృష్ణంరాజు తెలిపారు. ఈ మధ్య బాహుబలికి తర్వాత భారీ మొత్తం డబ్బిస్తామని.. మా హిందీ సినిమాలో నటించాల్సిందిగా ఒకరు సంప్రదించారని.. అయితే ప్రభాస్ కథ చెప్తేనే.. ఆ కథపై తనకు నమ్మకం వుంటేనే ఆ సినిమాలో నటిస్తానని తేల్చి చెప్పేశాడని కృష్ణంరాజు వెల్లడించారు. తనకు కావాల్సింది డబ్బు కాదని.. కథ బాగుండాలని ప్రభాస్ చెప్పి పంపాడన్నారు.