ప్రజల నాడిని పసిగట్టిన నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని హీరో నాగార్జున చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో అక్కినేని నాగేశ్వర రావు జాతీయ పురస్కారాన్ని దర్శకుడు రాజమౌళికి అందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... అక్కినేని జాతీయ పురస్కారం స్వీకరించినందుకు రాజమౌళికి ధన్యవాదాలు అని చెప్పారు.
"వెండితెర పుట్టినప్పుడు అనుకుందట, తాను బాహుబలి సినిమాను ప్రదర్శించడానికే పుట్టానని, బాహుబలి సినిమా రావడంతో అది పులకరించిందట" అంటూ ఓ దర్శకుడు ఓ కవిత రాసి తనకు చెప్పాడన్నారు. అలాంటి సినిమాను రాజమౌళి అద్భుతంగా తీశాడని కొనియాడారు.
ఇకపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనం కోసం ఆలోచించే మనిషని, ప్రజలకి ఏం కావాలో ఆయనకు తెలుసన్నారు. ప్రజల కోసం మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇళ్లు, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
చివరగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ... కాలేజీ వయసులోనే ఉద్యమాల్లో చేరారని, స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారని, పదవులు ఆయనను వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్నారని, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు.