బీజేపీలో చేరనున్న సహజనటి : ఫలించిన ఈటల మంతనాలు

మంగళవారం, 9 ఆగస్టు 2022 (18:16 IST)
సహజనటి జయసుధ కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీసుకున్న ప్రత్యేక చొరవ, మంతనాల కారణంగా సహజనటి జయసుధ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సమ్మతించారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చే హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరబోతున్నారు. ఈమె గత 2009లో సికింద్రాబాబ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెల్సిందే. 
 
కాగా, వచ్చే 2023లో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఇందులోభాగంగా ఆపరేషన్ కమలం పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతలను లాగేస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రోజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ తదితరు బీజేపీ చేరేందుకు సిద్ధమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో సినీ నటులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేత ఈటల రాజేందర్‌తో జయసుధ భేటీ అయ్యారు. ఆమెతో ఈటల కొన్ని రోజులుగా సంప్రదింపులు జరిపారు. ఈ నెల 21న అమిత్ షా మునుగోడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమిత్ షా సమక్షంలో జయసుధ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. 
 
ప్రముఖ సినీ నటి విజయశాంతి ఇప్పటికే బీజేపీలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు జయసుధ కూడా బీజేపీలో చేరితే... ఆ పార్టీ సినీ గ్లామర్ మరింత పెరుగుతుంది. 2009లో సికింద్రాబాబ్ నుంచి పోటీ చేసి, జయసుధ ఎమ్మెల్యేగా గెలిచారు. 
 
ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి... 2016లో టీడీపీలో చేరారు. 2019లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధపై దృష్టి సారించిన బీజేపీ నేతలు చివరకు పార్టీలో చేరేలా ఆమెను ఒప్పించినట్టు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు