దీపికా పదుకునే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ నటించిన పద్మావతి’ సినిమా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమాకు నిరసన తెలుపుతూ.. రాజ్‌పుత్ వర్గీయులు తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఆందోళన చేస్తున్న వారు తొలుత సినిమా చూడాలన్నారు. సినిమాలో ఏదైనా అభ్యంతరకరమైన సీన్లు వుంటే దానిని తొలగించాలని డిమాండ్ చేయాలని సూచించారు.
నిజజీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యులు చరిత్రకారులను సంప్రదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం కలిగే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 68 రోజుల పాటు ఈ సినిమాపై పరిశోధన చేశాకే పద్మావతి రిలీజ్‌కు సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు సీబీఎఫ్‌సీ ప్రకటించింది.
'పద్మావతి' సినిమాలో ప్రధాన పాత్రలైన పద్మావతి, రతన్ సింగ్, అల్లా ఉద్దీన్ ఖిల్జీల మధ్య ఉన్న సంబంధం గురించి స్పష్టత వచ్చేవరకు సినిమా విడుదలయ్యేది కష్టమేనని సమాచారం. ఈ సినిమాలో రాజ్‌పుత్ రాణుల గౌరవాన్ని అగౌరవపరిచే సన్నివేశాలు ఉండి ఉంటాయని, చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నాడని రాజ్‌పుత్ సేనలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రారంభమై ఇప్పుడు మొత్తం హిందువుల సమస్యగా రూపాంతరం చెందిన ఈ వివాదానికి సీబీఎఫ్‌సీ నిర్ణయంతోనే తెరపడే అవకాశం ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో పద్మావతి సినీ బృందంపై వస్తోన్న హెచ్చరికలపై యూపీ సీఎం యోగి స్పందించారు. భన్సాలీ తల తేవాలని కొందరు నజరానా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. అలా హెచ్చరిక చేయడం తప్పయితే, భన్సాలీ చేసింది కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఈ సినిమా విషయంలో తమ రాష్ట్రంలో ఉన్న 22 కోట్ల మంది సెంటిమెంట్లను సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తాము తమ అభ్యంతరాలను చెబుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశామని తెలిపారు. అయితే, యోగి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీల నేతలు ఖండిస్తున్నారు.