ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, దసరా పండుగనాడు విడుదలై మొదటి రెండు రోజులు కలెక్షన్లు మందకొడిగా వున్నా మూడోరోజు శుక్రవారం నుంచి నేడే విడుదల అన్నంత రేంజ్‌తో అనూహ్యంగా కలెక్షన్లు పెరిగాయి. అలా రోజురోజుకూ పెరుగుతూ వుండడం చాలా ఆనందంగా వుంది. మంచి కథ వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేందుకు ఈ సినిమానే నిదర్శనం. ఇటువంటి సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంశీగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు వర్షాలు, మరోవైపు పెద్ద హీరోల చిత్రాల నడుమ స్వాతిముత్యం విడుదలయినా ప్రేక్షకుల ఆదరణ పొందడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ సినిమాలో మంచి కథ, సీనియర్ నటీనటులు చేయడం లాభించింది. మా అబ్బాయి గణేష్ మొదటి సినిమా అయినా సీనియర్స్‌తో చేయడం అందులోనూ మంచి కథతో రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను నిర్మాతయినా ఇంత మంచి కథను తీయలేనేమో. అలాంటి చిన్నబాబు, నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో తీసి సక్సెస్ ఇచ్చారు. మా గురువులు మోహన్‌బాబు తర్వాత ఈ సినిమా నిర్మాతలకు జీవితాంతం రుణపడి వుంటాను. దర్శకుడు చిన్న ఎమోషన్స్‌ను హిలేరియస్ కామెడీగా చూపించారు. నటుడు గోపరాజు క్లయిమాక్స్‌లో `పిల్లలు లేని వారికి తెలుసురా ఆ బాధేమిటో.. ఆ సరోగసీఏమిటో..` అంటూ డైలాగ్ ఎమోషన్‌తో కట్టిపడేశాడు.దర్శకుడు దానిని బాగా తీయగలిగాడు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు, ఓవర్‌సీస్‌వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెకండ్ వీక్ నుంచి కలెక్షన్లు పెరగడం జరిగింది. ఈ విజయం జన్మలో మర్చిపోలేను అని తెలిపారు.
చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, త్రివిక్రమ్ గారు సినిమా చూసి, రిపీట్ ఆడియన్స్ వస్తారు అంటూ ఆయన చెప్పిన మాట నిజమయింది. బెల్లంకొండ సురేష్‌గారు నా కథవిన్నాక నువ్వే చేయగలవని నీకు ఆ సత్తావుందంటూ నేను తీసిన షార్ట్ ఫిలిం చూసి మెచ్చుకోవడమేకాక, తెలిసినవారందరికీ నా షాట్ ఫిలిం గురించి చెప్పడం నాకు మరింత ధైర్యం కలిగించారు. ముందుగా ఈ కథపై పూర్తి నమ్మకంతో నాగవంశీగారు వున్నారు. ఆయన అనుకున్నట్లే హిట్ అయింది అని చెప్పారు.
గణేష్ మాట్లాడుతూ, మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు చూస్తారని నిరూపించారు. పెద్ద సినిమాల మధ్యలో మా చిన్న సినిమానూ చూసి మెచ్చుకున్నారు. నటుడిగా పేరు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌కూ, నాగవంశీగారికి, చిన్నబాబుగారికి, దర్శకుడు లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.