టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ దేవదాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్వనీదత్ నిర్మించిన దేవదాస్ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగార్జున పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ధనుష్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నానని... అలాగే హిందీలో బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్నానని చెప్పారు. ఇక తెలుగులో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నానని..ఈ రెండింటిలో ఏది ముందుగా ప్రారంభించేది త్వరలో చెబుతానన్నారు.
అఖిల్ గురించి మాట్లాడుతూ... బాలీవుడ్‌లో అఖిల్‌ని పరిచయం చేస్తానని కరణ్ జోహార్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. కానీ.. ముందు తెలుగులో నటుడుగా ఓ మాంచి సినిమా చేసాకా అప్పుడు హిందీలో చేయచ్చు అని చెప్పాను. తొందరపడద్దు అని చెప్పాను ఒకసారి తొందర పడ్డాడు ఏం జరిగిందో తెలుసు. మళ్లీ ఎందుకు తొందరపడటం అని చెప్పాను అంటూ అఖిల్ ఫస్ట్ మూవీని సోషియో ఫాంటసీ మూవీగా చేయడం, అలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని తొందరపడ్డాడని తన మనసులో మాటలను చెప్పీచెప్పనట్టుగా బయటపెట్టారు నాగ్.