అఖిల్ తొలి హీరోయిన్ సాయేషా త్వరలో పెళ్లి కూతురు కానుంది. ఇప్పటివరకు తమిళ హీరో ఆర్యతో ప్రేమలో వుందని.. త్వరలో పెళ్లి చేసుకోనుందని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు నిజమేనని సాయేషా, ఆర్య ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో సాయేషా.. ఆర్యతో తన పెళ్లి నిజమేనని తేల్చేసింది.
ఇకపోతే.. ఆర్య, సాయేషా గజినీకాంత్ చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటికే ఇరువైపు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. సాయేషా ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు. తాజాగా సాయేషా, ఆర్యల వివాహాన్ని ధ్రువీకరిస్తూ విడుదలైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంకా ఆర్య, సాయేషా జంటగా వున్న ఫోటో సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంకేముంది.. ప్రేమ జంట నుంచి దంపతులుగా మారనున్న ఆర్య, సాయేషాలకు శుభాకాంక్షలు తెలియజేద్దాం..