మా నాన్న ఓ పెద్ద కమ్యూనిస్ట్.. కానీ నాకేమో తెలుగుదేశం పార్టీ అంటే అమిత ఇష్టం. అదేసమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీ చేయను. నామినేట్ పదవులూ అలంకరించను. కానీ, తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తా. ముఖ్యంగా ప్రచార విభాగంలో తనవంతు సేవ చేస్తానంటున్నారు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్.
సీనియర్ హీరో నాగార్జున, నేచురల్ స్టార్ నాని, హీరోయిన్లు ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం "దేవదాస్". వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, వైజయంతీ మూవీస్ పతాకాలపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సి.అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ 45 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత సి.అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ, తన బ్యానర్‌లో వచ్చిన సినిమాల గురించేకాకుండా, రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు ఇష్టమో చెప్పారు. 'తెలుగుదేశం పార్టీ ప్రచారానికి సంబంధించిన పనులు చేయడానికి నేను సిద్ధమని చెప్పారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను. ప్రచార విభాగంలో మాత్రం తప్పకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఎన్.టి.రామారావు పార్టీ పెట్టడానికి వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేస్తారు, గొప్పగా చేస్తారు అని అనుకున్నాను తప్ప, నేను ఆయన వెనుక రాలేదు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి స్థిరపడిన తర్వాత ఇక్కడ చంద్రబాబునాయుడు చేస్తున్న పనులు చూసి, కేవలం ఆయన మీద అట్రాక్షన్‌తో వచ్చాను. స్వతహాగా నా నరనరాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందన్నారు. పైగా, మా నాన్నగారు పెద్ద కమ్యూనిస్ట్. అలాంటిది నాకు చంద్రబాబునాయుడు మీద ఇష్టం, అందుకే తెలుగుదేశం పార్టీకోసం ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు.