అతిథి దేవో భవ ఏ ఒక్కరినీ నిరాశ పరచదు - అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి

గురువారం, 6 జనవరి 2022 (17:43 IST)
Athidhi Devo Bhava pre release
ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్‌గా ‘అతిథి దేవో భవ’ అనే సినిమాను డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కించారు. రాం సత్యనారాయణ రెడ్డి సమర్ఫణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. 
 
ఈ కార్యక్రమంలో మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీ మెంబర్స్ సినిమా తీస్తే మంచిదే తీస్తారు.. చెడ్డది తీయరని నాకు తెలుసు. మొన్నే ఈ సినిమాను తీశాను. డీసెంట్ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంది. సప్తగిరి గారు సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తారు. ఓ రెండు మూడు నిమిషాలుండే దొంగ కారెక్టర్ చాలా బాగుంది. రోహిణి గారు బాగా చేశారు. ఆదిని చూస్తే చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ఇందులో అవన్నీ చాలా కంట్రోల్ చేసుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. ఇలాంటి సినిమాలకు ప్రమోషన్లు, సోషల్ మీడియా వ్యూస్ అవసరం లేదు. ఈ సినిమాకు వచ్చిన ఏ ఒక్కరినీ కూడా నిరాశ పర్చదు. అందరికీ నచ్చుతుంది. సినిమా నచ్చిన వాళ్లు ఓ పది మందికి చెప్పండి. నచ్చకపోతే 20 మందికి చెప్పండి. ఎందుకంటే సినిమాను నేను చూశాను. అందరికీ నచ్చుతుంది. చిన్న సినిమాలు మౌత్ టాక్‌తోనే ముందుకు వెళ్తాయి. ఈ సినిమాను అందరూ ఆదిరస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఆది సినిమా కోసం ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. సాయి కుమార్‌తో నా ప్రయాణం చాలా ఏళ్లది. నా మొదటి సినిమా వందేమాతరం నుంచి సాయి కుమార్‌తో ప్రయాణం చేస్తున్నాను.ఆదికి పెద్ద సక్సెస్ రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. శేఖర్ చంద్ర చెప్పినట్టు మంచి స్టోరీ ఉంటేనే మంచి సంగీతం వస్తుంది. ఈ మ్యూజిక్ వింటుంటే సినిమా బాగుంటుందని అర్థమవుతోంది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
జీవిత మాట్లాడుతూ.. ‘సాయి కుమార్ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైకి వెళ్లారు. అందులో శివానీ నటిస్తోంది. మీ పిల్లల దగ్గర నేనుంటాను.. నా పిల్లల దగ్గర మీరు ఉండండి అని సాయి కుమార్ అన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం. సాయి కుమార్ గారి ఫ్యామిలీతో మాకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. ఆది కూడా మా అబ్బాయిలాంటి వాడే. ఆది మొదటి సినిమా పెద్ద సక్సెస్ అయింది. మాకు చాలా సంతోషమేసింది. ఆది కష్టపడే తత్వానికి ఇంకా పెద్ద సక్సెస్ రావాలి. అది త్వరలోనే రానుంది. నాగేశ్వర్ అద్బుతంగా తెరకెక్కించారు. శేఖర్ చంద్ర గారి సంగీతం బాగుంది. భాస్కర భట్ల గారి సాహిత్యం, పాటలు ఎప్పుడూ బాగుంటాయి. ఆది పర్ఫామెన్స్ ఇంకా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. ఎమోషనల్ పాత్రలో ఆది బాగా నటించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అఖండ సినిమాతో మిర్యాల రవీందర్ రెడ్డి గారు సక్సెస్ కొట్టారు. సక్సెస్ అనేది మీ ఫ్యామిలీలోనే ఉంది. ఈ సినిమా కూడా విజయం సాధించాలి’ అని అన్నారు.
 
కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ అనే భయం మొదలైంది. కానీ తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. మామూలుగా అయితే జనవరి 7న ఆర్ఆర్ఆర్ రావాలి. ఆ సినిమా ఎంత హిట్ అయ్యేదో అతిథి దేవో భవ కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది. నేను కొంచెం ఆదిగారిలా కనిపిస్తాను. రాజా విక్రమార్కలో సాయి కుమార్ గారితో నటించాను. ఆది గారి అమ్మ కూడా అలానే అన్నారు. అందుకే ఆదిని చూసినప్పుడు నాకు సోదరభావం కలుగుతుంది. నేను ఒక్క మెసెజ్ పెట్టడంతోనే ఆది గారు నా రిసెప్షన్‌కి వచ్చారు. ఆది గారు ఫైట్స్, సాంగ్స్‌కు ఫేమస్. కానీ ఇందులో ఎమోషన్ కూడా బాగా చేశాడనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్ అవుతుందని అర్థమవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘నటించడం చాలా సులభం. కానీ ఇలా మాట్లాడటం అంటేనే కష్టం. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ట్రైలర్ విడుదల చేసిన నాని గారికి థ్యాంక్స్. కార్తికేయ బ్రో చాలా కష్టపడతాడు. మా నిర్మాతలు ఎంతో కష్టపడి సినిమాను తీశారు. డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఇలా అందరూ కష్టపడి సినిమాను తీశాం. మంచి సినిమాను తీశామని నమ్మకం ఉంది. మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. సప్తగిరి గారు కల్మషం లేని మనిషి. నాకు ఆయన చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఇంకా సినిమాలు చేయాలి. మా హీరోయిన్ నువేక్ష, నా మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆడియో మంచి హిట్ అయింది. సినిమా కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అఖండ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక్కడకు వచ్చినర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారికి థ్యాంక్స్. నా సినిమాను కూడా అందరూ ఆదరించాలి. ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అయిందని చాలా బాధపడ్డాను. కానీ అదే రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పడంతో షాక్ అయ్యాను. మౌత్ టాక్ బాగుంటే సినిమాను ఆదరిస్తారు. తప్పకుండా సినిమా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
డైలాగ్, స్క్రీన్ ప్లే రైటర్ రజినీ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఆశీర్వందించేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మూవీ చూసే వాళ్లకు పిచ్చి ఉంటుందని అంటారు. కానీ తీయాలంటే అంతకు మించి పిచ్చి ఉండాలి. ఇష్టపడితే ఎంత కష్టమైనా కష్టంగా అనిపించింది. అతిథి అంటే తిథి, నక్షత్రం చూడకుండా వస్తారు. మీరు అతిథుల్లా వచ్చి మా సినిమాను ఆశీర్వదించండి. మేం ఎంత కష్టపడి చేసినా కూడా ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. మా ముగ్గురు బ్రదర్స్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మా ఆయన వంద శాతం కష్టపడి సినిమా చేశారు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా శేఖర్ చంద్ర గారు వింటూనే ఉంటారు. భాస్కర భట్ల గారికి అలా సిట్యువేషన్ చెబితే పాట రాసేవారు. ఆది గారిని ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూస్తారు. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా కొత్తగా ఉంటారు. సప్తగిరి కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంది. రోహిణి గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
 
డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత రాజాబాబు ఆడియెన్స్‌లో వింటారు. పట్టుబట్టి చేయించుకుంటారు. ఆయన మా నిర్మాత అని గర్వంగా చెప్పుకుంటాను. మరో నిర్మాత అశోక్ రెడ్డి గారికి థ్యాంక్స్. ఆది గారు ఇది వరకు చేసిన జానర్ల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సారి కచ్చితంగా హిట్ కొడతామని ఆశిస్తున్నారు. అమర్ గారి ఫోటోగ్రఫీ అద్బుతంగా వచ్చింది. సప్తగిరి కామెడీ సినిమాకు హైలెట్. రోహిణి గారి పాత్ర బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామిక్‌గా ఉంటుంది. సెకండాఫ్ కొత్తగా ఉంటుంది. నువేక్ష బాగా చేసింది. ఈవెంట్‌కు వచ్చిన రవీందర్ రెడ్డి గారికి, హీరో కార్తికేయకు థ్యాంక్స్’ అని అన్నారు.
 
భాస్కరభట్ల మాట్లాడుతూ.. ‘ఆది నాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువే. అందరికీ రాసిన దాని కంటే ఆది కాస్త గుప్పెడంత ఎక్కువ రాస్తాను. దర్శకుడు మంచి సందర్భం చెప్పారు. శేఖర్ చంద్ర మంచి బాణీలు ఇచ్చారు. సంక్రాంతి బోణీ ఈ సినిమాతో మొదలవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
 
నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. ‘మిర్యాల రవీందర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు. వాళ్ల కుటుంబ సభ్యులే ఈ సినిమాను నిర్మించారు. ఆర్ఆర్ఆర్ రావాల్సిన టైంకు అతిథి దేవో భవ రావడం అందరికీ సర్ ప్రైజ్. ఆదితో ఆల్రెడీ ఓ సినిమా చేశాం. మళ్లీ జనవరి 22న ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతోన్నాం. ఆది అద్భుతమైన నటుడు. ఈ సినిమా హిట్ అయితే మాకు కూడా ప్లస్ అవుతుంది. ట్రైలర్ చూస్తే బాగుందనిపిస్తోంది. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
సప్తగిరి మాట్లాడుతూ.. ‘మిర్యాల రవీందర్ రెడ్డి గారు అఖండతో మంచి సక్సెస్ కొట్టారు. మళయాలంలో జోసెఫ్ సినిమా చూశాను. ఆ సినిమా రాజశేఖర్ గారికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఆదితో నా కాంబినేషన్ ఎప్పుడూ బాగుంటుంది. ఆయనతో నటించినప్పుడు నాకు స్పేస్ దొరుకుతుంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉన్నా.. ఎమోషన్ బాగుంటుంది. మీ సక్సెస్ కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
 
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. జనవరి 7న రాబోతోన్న అతిథి దేవో భవ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. శేఖర్ చంద్ర, భాస్కర్ భట్ల కాంబినేషన్‌లో ఎన్నో హిట్లు ఇచ్చాం. లక్కీ మీడియా బ్యానర్‌ కోసం నిన్ను చూడగానే అనే పాటను నా దగ్గరే ఏడాదిగా ఉంచుకున్నాను. ఈ సినిమా కోసం ఇచ్చేశాను. అది పెద్ద హిట్ కానుంది. సంక్రాంతి కంటే ముందే రాబోతోన్న ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
తీస్ మార్ ఖాన్ నిర్మాత తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజశేఖర్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఓ సినిమా చేయాలి. కానీ కుదర్లేదు. నాగేశ్వర్‌ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ముందుగా ఆయనతోనే సినిమా చేయాలి. కానీ టైం కుదర్లేదు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. మీతో మళ్లీ ఒక సినిమా చేస్తాను. ఆదికి ఇది మంచి సినిమా  అవుతుంది. మా రాబోయే సినిమాకు ఇది ప్లస్ అవుతుంది’ అని అన్నారు.
 
విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ‘ప్రేమ కావాలి సినిమా జరుగుతున్న సమయం నుంచి ఆదిగారు నాకు తెలుసు. మేం కలిసి సినిమాను చేయాలని అనుకున్నాం. మంచి నటుడు, మంచి డ్యాన్సర్. ఆయనకు రావాల్సినంత సక్సెస్ ఇంకా రాలేదు. ఈ సినిమాతో అది రావాలి. డైరెక్టర్ నాగేశ్వర్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
 
శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ‘చిత్రయూనిట్ సహకారం వల్లే సాంగ్స్ ఇంత బాగా వచ్చాయి. కథ, సందర్భంగా బాగుండటం వల్లే పాటలు చక్కగా కుదిరాయి. భాస్కర భట్ల గారి సాహిత్యం బాగుంది. మా ఈ ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేశాం. పాటలు పాడిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు