యుద్ధంలో సైనికులు తోటి సైనికులను ఊచకోత కోసినట్లుగా బాహుబలి-2 భారతీయ చలనచిత్ర రికార్డులను ఊచకోత కోసింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్లు ఏ భారతీయ చిత్రానికి భవిష్యత్తులోనూ సాధ్యంకానంత భారీ రికార్డులను సాధించే దిశగా పరుగు పెడుతున్నాయి. శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి2 చిత్రం ఒక్క భారత దేశంలోనే తొలిరోజు 121 కోట్లు వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 217 కోట్లు వసూలు చేసి అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమను నివ్వెరపరిచింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగిందంటే నాలుగు రోజుల వ్యవధిలోనే బాుహుబలి 2 సినిమా 750 నుంచి 800 కోట్ల రూపాయలను వసూలు చేయడం ఖాయమంటున్నారు సినీ పండితులు ఇదే సాధ్యమైతే వారంరోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్‌లోకి బాహుబలి-2 దూసుకెళ్లడం ఖాయం.
ఎలాగో చూద్దాం. శుక్రవారం విడుదలయ్యే ప్రతి సినిమా శనివారం, ఆదివారం మరింతగా వసూలు చేయడం రివాజు. ఎందుకంటే శని, ఆదివారాలు సెలవు దినాలు కాబట్టి శుక్రవారం వసూళ్లకంటే శని, ఆదివారం వసూళ్లు ఇంకా అధికంగా ఉంటాయి. పైగా మే 1 అంటే సోమవారం కూడా మేడే సందర్భంగా సెలవు కాబట్టి వరుసగా మూడు సెలవుదినాల్లో గరిష్ట సంఖ్యలో జనం సినిమా చూసే అవకాశం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే బాహుబలి టీం, నిర్మాతలు, దర్శకుడు ఊహిస్తున్న వెయ్యి కోట్ల వసూళ్లలో నాలుగింట మూడు వంతులు నాలుగురోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు.