భారతీయ చిత్రసీమలో సంచలనం.. సినిమా రికార్డులన్నీ బద్దలు... ఇప్పటికే రూ.925 కోట్ల వసూళ్లు

ఆదివారం, 7 మే 2017 (10:10 IST)
భారతీయ చిత్రసీమలో సంచలనం చోటుచేసుకుంది. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి, ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన దృశ్యకావ్యం "బాహుబలి 2" భారత సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రంగా అవతరించింది. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమాకూ సాధ్యంకానన్ని వసూళ్లు సాధించి.. ఇప్పుడు రూ.1000 కోట్ల కలెక్షన్‌ దిశగా దూసుకెళుతోంది. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.925 కోట్లు సాధించిన ఈ చిత్రం ఇపుడు రూ.1000 కోట్ల దిశగా దూసుకెళుతోంది. ఈ వీకెండ్‌లోనే రూ.1000 కోట్ల కలెక్షన్‌ కూడా పూర్తవుతుందని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో 'బాహుబలి 2' రూ.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించనుంది. 
 
కాగా, గత 28వ తేదీన ప్రపంచ వ్యాప్తగా విడుదైన ఈ చిత్రం వసూళ్లపై దక్షిణ భారత సినీ ట్రేడ్‌ విశ్లేషకుడు రమేశ్‌ బాలా ట్విటర్లో స్పందిస్తూ.. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.925 కోట్లు వసూలు చేసింది. తనకు తెలిసి.. భారత సినీ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ సినిమా ఇలాంటి బిజినెస్‌ చేయలేదన్నారు. 
 
'బాహుబలి 2' ఇప్పటి వరకు భారత్‌లో 745 కోట్లు (గ్రాస్‌).. విదేశాల్లో 180 కోట్లు వసూలు చేసింది. ఇంతకు ముందు అత్యధిక వసూళ్లు సాధించిన భారత చిత్రం రికార్డు అమీర్‌ఖాన్‌ నటించిన 'పీకే' చిత్రంపేరిట ఉంది. ఇది మొత్తం రూ.792 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఈ రికార్డును బాహుబలి2 తొలివారంలోనే చెరిపేసిందని ఆయన వివరించారు. 
 
గత 70 యేళ్ళలో చిత్ర సీమలో నమోదైన అన్ని రికార్డులను బాహుబలి 2 చిత్రం చెరిపేయడం గమనార్హం. ముఖ్యంగా.. ఇప్పటివరకు సినిమా రికార్డులు అంటే ఒక్క బాలీవుడ్‌కే సొంతమని చెప్పుకుంటూ వచ్చారు. కానీ, ఒక దక్షిణాది సినిమా.. అదీ ఒక ప్రాంతీయ భాషా చిత్రం దేశ సినీ రికార్డులనే తిరగరాయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి