ఖైదీ, శాతకర్ణి సినిమాలకు తర్వాత ఈ ఏడాదిలో మరో భారీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. బాహుబలికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న బాహుబలి 2 బిజినెస్ అమాంతం పెరిగిపోతోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి 2' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 500 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.
కేవలం డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమా రూ.500 రాబట్టినట్లు ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాల ట్వీట్ చేశారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న 'బాహుబలి 2' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 'బాహుబలి'కి కొనసాగింపుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే.. బాహుబలి ద బిగినింగ్ సినిమా దాదాపు రూ.180కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు చేసిన భారతీయ సినిమాలోనే రికార్డులతో చరిత్ర సృష్టించింది. తద్వారా 2015లో భారత్‌లో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'బాహుబలి 2' (ద ఎండింగ్) ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.