దుబాయ్‌లో బాహుబలి2 ప్రదర్శన రద్దు.. పంపిణీదారులతో నిర్మాతలకు విభేదాలు

శుక్రవారం, 12 మే 2017 (06:49 IST)
దుబాయ్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతున్న బాహుబలి-2కు అనుకోని అవాంతరం ఎదురైంది. దుబాయ్‌లో అకస్మాత్తుగా సినిమా ప్రదర్శనను ఆపేశారు. తెలుగు, తమిళం, మలయాళ వర్షన్లలో సినిమాను ప్రదర్శించడం లేదని అంటున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయా భాషల్లో సినిమా ఆగిపోయిందని అక్కడ సినిమాను పంపిణీ చేసిన వ్యక్తి చెప్పాడు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించి.. యథావిధిగా షోలు వేస్తామని చెబుతున్నారు. అయితే.. హిందీ వెర్షన్‌ మాత్రం ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా రన్ అవుతోందని వెల్లడించాడు. ఇక, ఈ మూడు భాషల్లో సినిమా ప్రదర్శన లేకపోడం.. హిందీ వెర్షన్‌కు కలిసొస్తుందని చెబుతున్నారు. ఇక, దుబాయ్‌లో ఇప్పటికే 17 మిలియన్ డాలర్ల మార్కును దాటేయడం విశేషం.
 
ఈ వివాదానికి అసలు కారణం బాహుబలి2 విడుదలకు ముందే ప్రారంభమైందని తెలుస్తోంది. తమిళ పంపిణీ హక్కులకు సంబంధించిన మొత్తాన్ని నిర్మాతలకు  చెల్లించకపోవడంతో రెండువారాలు గడువ ఇచ్చారట. ఆ రకంగా నిర్మాతలు రాజీ పడినా, పంపిణీ దారు మాత్రం గడువు దాటిన తర్వాత కూడా ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో గల్ఫ్ దేశాల్లో సినిమా ప్రదర్శన నిలిపివేశారు. తమిళ హక్కులను కొనుగోలు చేసిన కె ప్రొడక్షన్స్ బకాయిపడిన 15 కోట్ల రూపాయలను నిర్మాతలకు చెల్లించని కారణంగా చిత్రం నిలిచిపోవడంతో ఇప్పటికి ఎగబడి చూస్తున్న ప్రేక్షకులకు తీవ్ర ఆశాభంగం కలిగిందని సమాచారం. 
 
లాభాలు కుమ్మరిస్తున్న బాహుబలి2 వంటి సినిమాకే పంపిణీ దారు డబ్బులు చెల్లించకపోవడం జరిగిందంటే మిగతా చిన్నాచితకా నిర్మాతలకు  ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో హిందీ బాహుబలి 2 మాత్రమే ప్రదర్శించబడుతోంది. 
 

వెబ్దునియా పై చదవండి