దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'బాహుబలి ది బిగినింగ్'. ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అదేసమయంలో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నమోదైన అన్ని రికార్డులను తిరగరాసింది.
అయితే, తొలి భాగం జూలై 10, 2015న విడుదలైంది. నేటితో ఈ చిత్రం మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. 'బాహుబలి' సినిమా ప్రభాస్ రేంజ్‌ని పూర్తిగా మార్చేసింది. హిందీ నిర్మాతల నుండి ప్రభాస్‌కి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.
అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కిన 'బాహుబలి' చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా, ఇందులో సన్నివేశాలు తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి. చైనాలోనూ ఈ చిత్రం వసూళ్ల సునామి సృష్టించింది. అంటే 'బాహుబలి' ప్రభంజనం ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్ బుక్స్, ఏనిమేషన్ సిరీస్, మర్చెంట్ డైస్‌లకు మంచి ఆదరణ లభించింది. 'బాహుబలి'కి సీక్వెల్‌గా వచ్చిన 'బాహుబలి-2' చిత్రం 65వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ యాక్షన్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రజాదారణ పొందిన చిత్రంగా అవార్డులను గెలుచుకుంది.